పోచారం అభివృద్ధికి బాటలు.. విమర్శలపై ఎమ్మెల్యే మల్రెడ్డి ఘాటు హెచ్చరిక
రూ.1.05 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ఇబ్రహీంపట్నం: నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ఇప్పటివరకు అభివృద్ధి పనులపైనే దృష్టి సారించానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అయితే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇకపై సహించబోమని హెచ్చరించారు.
ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి సుమారు రూ.1.05 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. పంచాయతీ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ, రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. మరో రూ.20 లక్షలతో భూగర్భ డ్రైనేజీ, రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ప్రజలను దోచుకున్న వారికి తాను కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుండటం కడుపుమంటగా మారిందని విమర్శించారు. అందుకే సోషల్ మీడియాలో తనపై పిచ్చిపిచ్చి పోస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
“ఇప్పటివరకు అభివృద్ధిపైనే దృష్టి పెట్టా.. ఇకపై అసత్య ప్రచారాలు చేస్తే భరతం పడతాం. తీరు మార్చుకోకపోతే మా కార్యకర్తలు కూడా తగిన విధంగా స్పందిస్తారు” అని మల్రెడ్డి రంగారెడ్డి హెచ్చరించారు.
గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొచ్చి రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు అభివృద్ధి పనులను గమనించాలని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు.




