విజయవాడలో బ్రాహ్మణులపై దాడి దారుణం: దామరాజు క్రాంతికుమార్
బోండా ఉమాపై చట్టపరమైన చర్యలు తీసుకుని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి
ఒంగోలు: విజయవాడ సత్యనారాయణపురం నియోజకవర్గంలో డీఎస్సీ అక్రమాలు, అన్యాయాలకు నిరసనగా నిర్వహించిన నిరాహార దీక్షలో పాల్గొన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకులపై దాడి చేయడం దారుణమని వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్ తీవ్రంగా ఖండించారు.
దీక్షకు పోలీసుల నుంచి అనుమతులు ఉన్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు దీక్షా శిబిరంపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మూత్రం బాటిళ్లు, కోడిగుడ్లు విసరడంతో పాటు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి, బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.
ఈ ఘటనను కేవలం ఒక ప్రాంతంలో జరిగిన వివాదంగా చూడరాదని, రాష్ట్రంలోని బ్రాహ్మణ సమాజాన్ని అవమానించినట్లుగా భావించాలని క్రాంతికుమార్ అన్నారు. బ్రాహ్మణుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు అధికార అహంకారంతో వ్యవహరించడం సరికాదని విమర్శించారు.
దాడికి బాధ్యులైన వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమాను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించాలని కోరారు.
లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను ఓటు ద్వారా తెలియజేస్తారని దామరాజు క్రాంతికుమార్ హెచ్చరించారు.


