బెంజర్ దొడ్డిలో ఉండాల్సిన బర్రెలు ఎక్కడ?
తప్పిపోయిన పశువుల విషయంలో గ్రామ అధికారుల నిర్లక్ష్యమా?
చట్ట ప్రకారం యజమానులకు అప్పగించాలి లేదా బహిరంగ వేలం నిర్వహించాలని గ్రామస్థుల డిమాండ్
పున్నమి ప్రతినిధి
కిష్టాపూర్ (రెబ్బెన మండలం), ఆగస్టు 6, 2026
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామంలో వివిధ గ్రామాలకు చెందిన కొన్ని బర్రెలు తప్పిపోయి గ్రామ పరిసరాలకు వచ్చినప్పటికీ, వాటి విషయంలో గ్రామ పంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
గ్రామానికి వచ్చిన గుర్తుతెలియని పశువులను గ్రామ పంచాయతీ బెంజర్ దొడ్డిలో ఉంచి, గ్రామంలో ప్రకటనలు, నోటీసులు జారీ చేసి యజమానులను గుర్తించే ప్రయత్నం చేయాల్సి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎవరూ ముందుకు రాని పక్షంలో నిబంధనల ప్రకారం బహిరంగ వేలం నిర్వహించి తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు.
అయితే కిష్టాపూర్ గ్రామంలో ఈ నిబంధనలు అమలు కావడం లేదని, గ్రామ అధికారులు, సర్పంచ్, వార్డు సభ్యులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.
అంతేకాకుండా, తప్పిపోయిన బర్రెలను గ్రామంలోని కొందరు వ్యక్తులు తమ వద్ద కట్టేసుకుని పెంచుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని వారు కోరుతున్నారు.
గ్రామానికి వచ్చిన పశువులను చట్టబద్ధమైన విధానంలో నిజమైన యజమానులకు అప్పగించాలనీ, యజమానులు గుర్తించలేని పరిస్థితిలో ప్రభుత్వ నిబంధనల మేరకు బహిరంగ వేలం నిర్వహించాలనీ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా పశుసంవర్ధక శాఖ, పంచాయతీరాజ్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


