విశాఖపట్నం, (పున్నమి ప్రతినిధి): ఆగస్టు 5 : మధురవాడ కార్ షెడ్ జంక్షన్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని స్థానికులు, కార్మికులు, విద్యార్థులు, ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం ఒక వైపు మారికవలస, మరోవైపు బాంబే కాలనీ, ఇంకోవైపు హనుమంతవాకలో అన్నా క్యాంటీన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ మూడు ప్రాంతాల మధ్య ప్రధాన కూడలిగా ఉన్న కార్ షెడ్ జంక్షన్లో మాత్రం అన్నా క్యాంటీన్ లేకపోవడం ప్రజలకు అసౌకర్యంగా మారింది.
ఈ ప్రాంతంలో అనేక దుకాణాలు, వాణిజ్య సంస్థలు, కళాశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలు ఉండటంతో పాటు నిత్యం వేలాది మంది కార్మికులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. నగరంలోని ప్రధాన బస్సు మార్గాలకు అనుసంధానంగా ఉండటంతో ఈ జంక్షన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందుబాటులోకి వచ్చి వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం, సంబంధిత అధికారులు మధురవాడ కార్ షెడ్ జంక్షన్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.




