*
విశాఖపట్నం, ఆగస్టు 4:
ఆంధ్రా యూనివర్సిటీ ఆర్ట్స్ బాయ్స్ హాస్టల్ మెస్‌లో నేడు విద్యార్థులకు అందించిన ఎగ్ కర్రీ నుంచి కుళ్లిన వాసన రావడం, కుళ్లిపోయిన టమాటాలు వంటి నాసిరకం కూరగాయలతో వంటలు తయారు చేయడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి నెలా నిర్ణీత సమయంలో మెస్ ఛార్జీలు చెల్లిస్తున్నప్పటికీ నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థులు మెస్‌లో వడ్డించిన ఆహారాన్ని తీసుకుని బీసీ ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు.
ఈ ఆందోళనకు ఆంధ్రా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు తరుణ్ విద్యార్థులకు నాయకత్వం వహించారు. విద్యార్థుల తరఫున యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గత వారం ఇదే సమస్యపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల నిరసన అనంతరం ప్రిన్సిపాల్, వార్డెన్ స్పందించి సమస్యను పరిశీలించారు. నాసిరకం ఆహారం తయారు చేసిన వంట సిబ్బందిపై చర్యలు తీసుకుని, బాధ్యులను సస్పెండ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇకపై విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా మెస్ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విశాఖపట్నం జిల్లా కార్యదర్శి జి. అజయ్ మాట్లాడుతూ, హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం యూనివర్సిటీ యాజమాన్యం బాధ్యత అని అన్నారు. హాస్టల్లో నెలకొన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

