ఖమ్మం, జూలై
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలపై పోరాడిన బీజేపీ నాయకులను రాజకీయ కక్షతో లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేశారని, అలాంటి కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా బుధవారం ఖమ్మం కోర్టుకు హాజరైనట్లు బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతులను తప్పుడు కేసులతో అణచివేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. అయితే బెదిరింపులకు, కక్ష సాధింపు రాజకీయాలకు భయపడకుండా ప్రజల పక్షాన పోరాడటం బీజేపీ నాయకుల నైజమని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ధైర్యంగా ప్రశ్నించిన పార్టీ బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయడానికి అధికారాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ బీఆర్ఎస్ అనుసరించిన విధానాన్నే కొనసాగిస్తోందని విమర్శించారు. అధికారాలు శాశ్వతం కావని, ప్రజలను మోసం చేస్తూ ప్రతిపక్షాలను వేధించే ప్రభుత్వాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ సందర్భంగా జరిగిన కోర్టు విచారణకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గల్లా సత్యనారాయణ, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ రాథోడ్, బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పమ్మి అనిత, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సరస్వతి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుమిలి శ్రీనివాస్, దీకొండ శ్యాం తదితరులు హాజరయ్యారు.
బీజేపీ లీగల్ సెల్ న్యాయవాదులు వెంకట గుప్తా, తుమ్మ శివ సమక్షంలో కోర్టు విచారణకు హాజరై తదుపరి న్యాయపరమైన ప్రక్రియలో పాల్గొన్నారు.



