అనకాపల్లి జిల్లా, జూలై 13 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలోని జిల్లాలోనే అతిపెద్ద శివాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ కాత్యాయనీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం నిజ జ్యేష్ఠ మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించారు. ఈ విశిష్ట కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
నిజ జ్యేష్ఠ మహాశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం, ఇందువాసర మహాపర్వదినం, మహాశైవాక్ష యోగం ఒకే రోజు కలిసిరావడం అత్యంత అరుదైన ఆధ్యాత్మిక విశేషంగా పండితులు పేర్కొంటున్నారు. వంద శివరాత్రులు ఆచరించినంత పుణ్యఫలం ఈ ఒక్క రోజు శివారాధనతో లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇలాంటి మహా యోగం వేల సంవత్సరాల కాలంలో అత్యంత అరుదుగా సంభవిస్తుందని, ఈ రోజు అనంతరం మళ్లీ ఇలాంటి శుభసందర్భం 2053 తర్వాత 2070 సంవత్సరంలోనే వస్తుందని ఆధ్యాత్మిక వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, మహామంగళహారతి, విశేష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఓంకార నామస్మరణతో ఆలయ ప్రాంగణం శివనామసంకీర్తనలతో మారుమోగగా, భక్తుల రద్దీతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
అనంతరం విచ్చేసిన భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని ఓంకారేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఆలయ ప్రధాన అర్చకులు ఎ.ఎం. సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అన్ని పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు.



