*పి.జి.ఆర్.ఎస్ వినతులపై శాఖాధికారులు ప్రతిరోజూ సమీక్ష నిర్వహించాలి*
*ప్రతి అర్జీదారునికి ఫోన్ చేసి నాణ్యమైన పరిష్కారం అందించాలి*
*అగ్నిమాపక శాఖ 101 సేవలపై విస్తృత ప్రచారం చేపట్టాలి*
–పి.జి.ఆర్.ఎస్ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,జులై 13. (పున్నమి ప్రతినిధి )
జిల్లాలో ఆయా శాఖలకు అందిన పి.జి.ఆర్.ఎస్ (PGRS) వినతుల పరిష్కార ప్రక్రియను ప్రతి శాఖాధికారి రోజువారీగా సమీక్షించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ప్రతి వినతిదారునికి తప్పనిసరిగా ఫోన్ ద్వారా సంప్రదించి, వారి సమస్యకు నాణ్యమైన, ఖచ్చితమైన, సంతృప్తికరమైన పరిష్కారం అందించాలని సూచించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పి.జి.ఆర్.ఎస్ సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎండార్స్ చేసిన వినతుల్లో సానుకూలంగా పరిష్కరించినవి ఎన్ని, ప్రతికూలంగా ముగిసినవి ఎన్ని అనే అంశాలను శాఖాధికారులు నిరంతరం విశ్లేషించాలని తెలిపారు. పి.జి.ఆర్.ఎస్ వినతులను కేవలం అధికారిక విధిగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావించి వ్యవహరించాలని సూచించారు.
ప్రజా సానుకూల అభిప్రాయంలో జిల్లా ర్యాంకు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ముందుగానే ప్రజలకు సమర్థవంతంగా వివరించి అవగాహన కల్పించాలని, సేవలు పారదర్శకంగా, నాణ్యతతో అందితే ప్రజల నుంచి సహజంగానే సానుకూల స్పందన లభిస్తుందని పేర్కొన్నారు.
ఐవిఆర్ఎస్ సర్వేలో సానుకూల స్పందన తక్కువగా నమోదైన ప్రభుత్వ శాఖల పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ సేవల నాణ్యతను మెరుగుపరచి సానుకూలతను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు.
అగ్నిమాపక శాఖకు సంబంధించి నెగటివ్ ఫీడ్‌బ్యాక్ అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో, అత్యవసర సేవల కోసం ఉపయోగించే 101 హెల్ప్‌లైన్ నంబర్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అగ్నిప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే 101కు సమాచారం అందించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
అక్షరాంధ్ర కార్యక్రమం కింద జిల్లాలో లక్ష్యంగా నిర్ధేశించిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అలాగే జిల్లా అధికారులు తమకు కేటాయించిన సచివాలయాలను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.
కౌశలం కార్యక్రమం ద్వారా జిల్లాకు చెందిన 139 మంది యువత టాటా మోటార్స్‌లో ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొంటూ, ఈ విజయానికి కౌశలం బృందాన్ని అభినందించారు. జిల్లాలోని మరింత మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, డి.ఆర్.ఓ సత్తిబాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


