తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం: చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిట్టపల్లి గ్రామంలో కోడూరు రూరల్ సీఐతో కలిసి పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులకు సైబర్ నేరాలపై జాగ్రత్తలు, ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వకూడదనే అంశాలపై వివరించారు. అనుమానాస్పద కాల్స్, లింకులు, సందేశాలను నమ్మకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అవగాహన కల్పించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం, పోలీసు శాఖ అందిస్తున్న సేవలు, అత్యవసర సహాయ నంబర్ల వినియోగంపై వివరించారు. గ్రామాల్లో మద్యం, జూదం, కోడిపందేలు, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలు చట్టాలను గౌరవిస్తూ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు సహకరించాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించాలని సూచించారు. పోలీసు–ప్రజల సమన్వయంతోనే నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

