నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని మారుతీ నగర్ శ్రీ వీర అభయ ఆంజనేయస్వామి ఆలయంలో హనుమ జయంతి వారోత్సవాలు ఘనంగా జరిగాయి.
నెల్లూరు పొదలకూరు పట్టణంలోని మారుతీ నగర్‌లో వెలసియున్న శ్రీ వీర అభయ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం కమ్మజన సేవా సంఘం ఆధ్వర్యంలో అంజనీసుతునికి విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. హనుమ జయంతి అనంతరం నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా ఏడో వారం ఈ కార్యక్రమాన్ని కమ్మజన సేవా సంఘం వారు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి స్వామివారికి వేదంపండితులు అభిషేకాలు, ఆకు పూజ నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసియున్నట్లు పేర్కొన్నారు. గ్రామోత్సవంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.


