*మంగళవారం హైదరాబాద్ నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి*
పేద ప్రజలకు చెంతనే ఖరీదైన వైద్య పరీక్షలు.
కలెక్టర్, ఎమ్మెల్యే మరియు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాజమాన్యాన్ని అభినందించిన సీఎం.
ప్రజలకు అత్యాధునిక మరియు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎం.ఆర్.ఐ యంత్రాన్ని మంగళవారం సీఎం కార్యాలయం హైదరాబాద్ నుండి వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభించారు.ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి సలహాదారు వేం రెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణా రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లా స్థాయిలోనే ఎం.ఆర్.ఐ సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
గతంలో ఇలాంటి ఖరీదైన వైద్య పరీక్షల కోసం పేదలు వరంగల్, హైదరాబాద్ వంటి సుదూర నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, దీనివల్ల వారికి సమయం, డబ్బు వృధా అయ్యేవని తెలిపారు. ఇప్పుడు స్థానికంగానే ఈ సేవలు అందుబాటులోకి రావడం వల్ల సకాలంలో ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ జరిగి, మెరుగైన వైద్యం అందుతుందిని తెలిపారు. ప్రజా వైద్య సేవల బలోపేతానికి సీఎస్‌ఆర్ నిధులతో ఎంఆర్‌ఐ యంత్రాన్ని ఏర్పాటు చేయుటకు ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును, అలాగే ఇందుకు సహకరించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాజమాన్యానాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్ నిధుల భాగస్వామ్యంతో ఈ అత్యాధునిక యంత్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచేందుకు, మౌలిక వసతుల కల్పనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రారంభ కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి పర్యవేక్షకులు డా రాజేంద్రప్రసాద్, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా వెంకటేశ్వర్లు, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా వెంకటరత్నం, కౌన్సిలర్లు, హెచ్ డి ఎఫ్ సి జోనల్ హెడ్ జోష్ స్టెఫీన్, క్లస్టర్ హెడ్ రాజేష్ వైద్యులు, సిబ్బంది మరియు ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.



