(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
హైదరాబాద్, జూన్
ఖమ్మం జిల్లాకు చెందిన 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అమానుష దాడి ఘటనను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారిని ABVP రాష్ట్ర మహిళా నాయకత్వం పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పింది.
ఈ సందర్భంగా బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ABVP ప్రతినిధులు, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ABVP రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కళ్యాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. చిన్నారిపై జరిగిన ఈ దారుణ ఘటన సభ్య సమాజాన్ని కలచివేసిందని పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి తక్షణ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిందితుడిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు, బాలికల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, శాంతిభద్రతల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టి, మహిళల భద్రతపై ప్రజల్లో విశ్వాసం పెంచాలని ABVP నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.



