
విశాఖపట్నం, మే18(పున్నమి ప్రతినిధి వి సతీష్ కుమార్): కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశాఖపట్నం జిల్లా ఎన్ ఏ డి కొత్త రోడ్డు ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పాలిక రవి సోమవారం ఉదయం మృతి చెందారు. 99 టివి రవిగా ప్రసిద్ధిగాంచిన రవి గత పదేళ్ళుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. ఏ కష్టం వచ్చినా పాత్రికేయులకు వెన్నుదన్నుగా నిలిచేవారు. అయితే గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. చికిత్స కోసం రూ.40 లక్షలు వరకు వ్యయమవుతుందని చెప్పడంతో స్థానిక
పాత్రికేయులు రెండు లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయగా, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు పి గణబాబు చొరవతో ప్రభుత్వం ఆస్పత్రి ఖర్చుల కోసం మరో ఏడు లక్షలు మంజూరు చేసింది. అయితే రవి సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. స్థానిక పాత్రికేయులు శాంతి నగరంలో గల రవి స్వగృహంలో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి గణబాబు కూడా రవి మృతికి సంతాపం తెలియజేస్తూ నివాళులర్పించారు.

