ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్ )
పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా మళ్లిస్తున్న రేషన్ డీలర్లపై వెంటనే సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమగాని యల్లారావు గౌడ్ డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లాలో కొందరు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పూర్తిగా పంపిణీ చేయకుండా, బియ్యం స్థానంలో నగదు ఇచ్చి మిగిలిన బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలు నిజమైతే అది పేదల ఆహార హక్కులను హరించడమే కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను దోపిడీ చేయడమేనని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం పేదల ఆహార భద్రత కోసం కేటాయిస్తున్న బియ్యాన్ని అక్రమంగా మళ్లించడం తీవ్రమైన నేరమని, దీనిపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రేషన్ బియ్యం బదులుగా నగదు ఇస్తామని ఎవరైనా ఒత్తిడి చేస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని లబ్ధిదారులకు సూచించారు.
అలాగే రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ అంశాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గల్లా సత్యనారాయణ, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొండపల్లి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పేద ప్రజలను సమీకరించి వారి తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.



