శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ
ఆత్మకూరు (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఏ.ఎస్.పేట మండలం కుప్పురుపాడు ఎస్సీ కాలనీలో శనివారం నూతనంగా నిర్మించిన శ్రీ సీతా లక్ష్మణ హనుమంత సమేత శ్రీ కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధల నడుమ జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో భక్తుల కోసం ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీవాసుల విన్నపానికి స్పందించిన ఆయన, ప్రతిష్ట మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు.
ట్రస్ట్ సభ్యులు అత్యంత భక్తిశ్రద్ధలతో రుచికరమైన భోజన వంటకాలను సిద్ధం చేసి గ్రామానికి పంపించగా, కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి ట్రస్ట్ చేస్తున్న సేవలను అభినందించారు. భక్తుల సంతృప్తి, ఆనందం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు మాట్లాడుతూ, తమ అభ్యర్థనను మన్నించి సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కంచి పరమేశ్వర రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ శ్రీరాముని దీవెనలతో వారి కుటుంబం సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.


