అనకాపల్లి జిల్లా, మార్చి 10 (పున్నమి న్యూస్ ప్రతినిధి – ఆనంద్):
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో నాటు తుపాకీ మిస్‌ఫైర్ కారణంగా 13 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. గ్రామానికి చెందిన ఆడారి వెంకట కౌశిక్ తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులో ఉన్న ఒక ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న నాటు తుపాకులను చూపిస్తూ అవి ఎలా పనిచేస్తాయో వివరించే క్రమంలో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ అయింది.
ఈ ఘటనలో గుండు కౌశిక్‌కు తగలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో భయపడిన ఇంటి యజమాని బాలుడి మృతదేహాన్ని సమీపంలోని తుప్పల్లో పడేసి పరారైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రెండు నాటు తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు



