విశాఖపట్నం, పున్నమి ప్రతినిధి, జనవరి :
అఖిల భారత బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సమన్వయ సంఘం పిలుపు మేరకు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఏపీ రాష్ట్ర బ్యాంకు విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బీవీవీ కొండలరావు మాట్లాడుతూ, బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల పింఛన్ రివిజన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్‌టీని రద్దు చేయాలని, పాత పింఛన్ పథకాన్ని ప్రస్తుత ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని కోరారు. ప్రైవేట్ బ్యాంకుల విశ్రాంత ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. అలాగే స్పెషల్ అలవెన్స్‌ను పింఛన్‌లో కలపాలని, విశ్రాంత ఉద్యోగులకు ఆర్‌బీఐ ఫార్ములా వర్తింపజేయాలని, విశ్రాంత ఉద్యోగ సంఘాలతో ఐబీఏ చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎ.ఎల్లారావు, పి.వీరారెడ్డి, జి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మద్దతు ప్రకటించారు. సుమారు 160 మంది సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు.



