ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద ప్రజలకు తీవ్ర నష్టం
– ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- *
10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడం వలన పేద ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కో – కన్వీనర్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీన విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం హాలులో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం వివిధ రాజకీయ పార్టీల, పౌర సంఘాల నేతలతో జరిగింది.
వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా ఆరోగ్య హక్కును వ్యాపార వస్తువుగా మార్చే ప్రమాదం ఉందన్నారు. ఈ పీపీపీ విధానం వాస్తవానికి ప్రైవేటీకరణకు కొత్త ముసుగు అన్నారు. ఇది అమలు అయితే ప్రజల జీవితం, ఆరోగ్యం, విద్య లాభ వ్యాపారాల బందీలుగా మారిపోతాయన్నారు. పీపీపీ విధానంలో ఉద్యోగుల నియామకాలలో రిజర్వేషన్లు అమలు కావని, సామాజిక న్యాయానికి తిలోద కాలిస్తారని, ఉద్యోగుల నియామకాలలో ప్రభుత్వ పాత్ర ఉండదన్నారు. 10 మెడికల్ కళాశాలలకు చెందిన దాదాపు 600 ఎకరాలు భూమి కొన్ని లక్షల చదరపు అడుగుల నిర్మాణం బడా వైద్య సంస్థలకు అప్పనంగా ఇస్తారని, కేవలం 3 లక్షల ఫీజుతో 66 సంవత్సరాలు మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆసుపత్రిని ఇస్తారన్నారు. ప్రజల ఆరోగ్యం కార్పొరేట్ లాభాల బానిస అవుతుందన్నారు. ఆరోగ్య వ్యవస్థ మానవత నుంచి వ్యాపార ధోరణికి మారుతుందన్నారు. రాష్ట్రంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలను, పౌర సంస్థలను, విద్యార్థి యువజన సంఘాలను కలుపుకుని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వి. బాల మోహన దాస్ ప్రసంగిస్తూ విద్య, వైద్యం పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రజల హక్కు అని చట్టపరంగా ప్రకటించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వ వైద్య రంగానికి కేటాయింపులు పెంచాలని కోరారు. వైద్యరంగం ను వ్యాపార దోపిడి నుండి కాపాడాలన్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల కృషి అమోఘమని, ప్రైవేట్ ఆసుపత్రులు ధనార్జన కేంద్రాలుగా మారినాయని గుర్తు చేశారు. దాతల సహకారంతో 10 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టవచ్చునని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. సిపిఎం సీనియర్ నేత, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరశిoగారావు ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. 3లక్షల 50 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 5 వేల కోట్లు 10 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు. యోగాంధ్ర లాంటి ఈవెంట్స్ లకు వేలాది కోట్లు ఖర్చు చేస్తుందని, అభివృద్ధి పేరుతో బడా కంపెనీలకు వందలాది ఎకరాలు 99 పైసలకే ధారాదత్తం చేస్తుందన్నారు. పేదలు ఋణ గ్రస్థులవడానికి వైద్యం వ్యయం పెరగడం ఒక కారణమన్నారు. గత 17 నెలలుగా ప్రభుత్వ ఆస్తులను, భూములను, సహజ వనరులను బడా కంపెనీలకు అప్పనంగా ఇవ్వడానికి నేటి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రమేష్ కుమార్, సిపిఐ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి షేక్ రహమాన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సుధాకర్, సిపిఐ (ఎంఎల్) ప్రజా పోరు నేత కె. మహిత, లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ డా. ఎన్. వి. యన్. దుర్గా ప్రసాదరావు, ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. కామేశ్వరరావు, పౌర గ్రంథాలయ పరిరక్షణ సమితి నేత బి ఎల్ నారాయణ, పీపుల్స్ ఫర్ ఇండియా నేత ఏవి ఆర్.కె మూర్తి, కుల వివక్షత పోరాట సమితి నేత చిరంజీవి, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి డి. రమణ,విశాఖ జిల్లా నివాస్ అధ్యక్షులు పి. నారాయణ మూర్తి తదితరులు ప్రసంగించారు.


