పున్నమి తెలంగాణ ప్రతినిధి:
– మా అమ్మను టార్గెట్ చేసిన్రు.. మా నాన్నను ఏం చేస్తరో..’ – బిడ్డ సుష్మిత వాఖ్యలు
– రేవంత్ రెడ్డి కుటుంబ దోపిడీపై నిన్న మీడియా సాక్షిగా వెల్లడి
– రేవంత్ అన్నదమ్ములకు గన్ మెన్ లు ఎందుకు ?
– మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత సంచలన ఆరోపణలు
వరంగల్ జిల్లా ; మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేసిన ఎన్. సుమంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారమే (అక్టోబర్ 14) విధుల నుంచి తొలగించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ఓఎస్డీగా నియమితులైన సుమంత్‌పై అధికారులపై ఒత్తిడి తేవడం, కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వంటి తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా, డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైలు విషయంలో సుమంత్ తుపాకీతో బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ అనంతరం ప్రభుత్వం అతడిపై వేటు వేసింది. విధుల నుంచి తొలగించబడిన సుమంత్.. మంత్రి సురేఖ నివాసంలోనే ఉన్నారనే సమాచారంతో బుధవారం రాత్రి మఫ్టీలో ఉన్న వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురు వ్యక్తులుగా మంత్రి ఇంటికి వచ్చారు. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వారిని గేటు వద్దే అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీసీ మంత్రి అయిన తన తల్లి కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని, రెడ్లందరూ కలిసి తమ ఫ్యామిలీని టార్గెట్ చేశారని విమర్శించారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉండటమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు.
మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి గన్మెన్లను తొలగించారని.. రేవంత్‌రెడ్డి సోదరులైన తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి పార్టీకి ఏం చేశారని, వారికి ప్రభుత్వం గన్ మెన్లను కేటాయించిందని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కుట్ర ఉందని.. సుమంత్‌ను అదుపులోకి తీసుకుని తమ తండ్రి కొండా మురళి పేరు చెప్పేలా ఒత్తిడి చేసి ఆ తర్వాత ఆయనను కూడా కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని సుస్మిత ఆరోపించారు. కాగా, ఈ హైడ్రామా జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ.. మాజీ ఓఎస్డీ సుమంత్‌ను తన కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో మరింత కలకలం రేపింది.
తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చిన వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులను మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై సుస్మిత రాజకీయ కుట్ర ఆరోపణలు చేశారు. ఈలోగా మంత్రి సుమంత్‌ను తన కారులో తీసుకెళ్లారు.


