ఈ ప్రాంతంలో బెల్జియన్ పారిశ్రామిక ప్రయోజనాల చర్చల నిమిత్తం ముంబైలోని బెల్జియం కాన్సుల్ జనరల్ ఫ్రాంక్ గీర్కెన్స్ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రగతి, ఇక్కడ పెట్టుబడి అవకాశాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, వ్యాపార అనుకూల వాతావరణం గురించి వివరించారు.
పర్యటనలో భాగంగా ఆయన శ్రీసిటీ పరిసరాలను సందర్శించారు. శ్రీసిటీ వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కాన్సుల్ జనరల్, విదేశీ పెట్టుబడిదారులకు ఇది అత్యంత అనువైన ప్రదేశం అని వ్యాఖ్యానించారు. వెర్మీరిన్ సంస్థ అధునాతన వీల్చైర్లు తయారు చేయడం ద్వారా బెల్జియం పరిశ్రమలకు శ్రీసిటీలో పునాది వేసిందని ప్రశంసించారు. వెర్మీరిన్ సంస్థకు శ్రీసిటీ మద్దతును అభినందిస్తూ, మరిన్ని బెల్జియన్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రపంచ స్థాయి పునరావాస పరికరాల తయారీ సంస్థ వెర్మీరిన్ పరిశ్రమ శ్రీసిటీలో ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నడాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, గ్లోబల్ భాగస్వామ్యాలను ప్రోత్సహించాలనే శ్రీసిటీ నిబద్ధతను కాన్సుల్ జనరల్ సందర్శన ప్రతిబింబిస్తుందని తెలిపారు.
అనంతరం వెర్మీరెన్ కంపెనీని ఫ్రాంక్ గీర్కెన్స్ సందర్శించి, అక్కడ ఉత్పత్తులు, ఇతర పారిశ్రామిక కార్యకలాపాలను పరిశీలించారు. ఆయనతో పాటు బెల్జియంలోని ఫ్లాండర్స్ రీజియన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమీషనర్ జయంత్ నడిగర్, వెర్మీరెన్ మేనేజింగ్ డైరెక్టర్ (శ్రీసిటీ ప్లాంట్) సయ్యద్ రియాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.
అంతర్జాతీయ భాగస్వామ్యాలు, కొత్త పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తూ భవిష్యత్తు దిశగా శ్రీసిటీ మరింత ముందడుగు వేస్తోందని చెప్పడానికి ఈ పర్యటన అద్దం పడుతోంది.


