

చీపురుపల్లి పంచాయతీ డైలీ మార్కెట్ వీధికి చెందిన పెద్దింటి ధనుంజయ 2025 DSC ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) — స్కూల్ PD ఉద్యోగానికి అర్హత సాధించి జిల్లా స్థాయిలో 58వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ధనుంజయ తల్లి ఒప్పంద పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబాన్ని నడిపించారు. ఇలాంటి ఆర్థిక ఇబ్బందుల మధ్య చదువులో, క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచి ఉద్యోగ అర్హత సాధించడం ధనుంజయ పట్టుదలకు నిదర్శనం.
ఈ విజయాన్ని గుర్తించిన రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ PAC కమిటీ సభ్యులు, విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు), యువజన కాంగ్రెస్ పార్టీ చీపురుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు.
పేదరికం మధ్య పట్టుదలతో ముందుకు సాగిన ధనుంజయ విజయం స్థానిక యువతకు స్ఫూర్తిదాయకమని, కష్టపడి చదివితే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

