బిల్లుల ఆమోదం వివాద వ్యాజ్యంలో సుప్రీంకోర్టు వెల్లడి
సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ దిల్లీ:
రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలపడంలో తనకు, గవర్నర్లకు న్యాయస్థానం కాల వ్యవధి నిర్ణయించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వివరణ కోరిన అంశాలకుగాను రాజ్యాంగ నిబంధనలు ఏమి చెబుతున్నాయో వాటిని మాత్రమే వివరిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది.
విడి విడి కేసుల వివరాల్లోకి వెళ్లబోమని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు. బిల్లుల ఆమోద వివాద వ్యాజ్యంపై ఆరో రోజున తమిళనాడు తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, పశ్చిమ బెంగాల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్లు నిరవధికంగా నిలిపివేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించరాదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను వారు తోసిపుచ్చారు.
పాలనాపరమైన అంశాల్లో కేంద్ర మంత్రి వర్గం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి, రాష్ట్ర క్యాబినెట్ సూచనల మేరకు గవర్నరు నడుచుకోవాల్సి ఉంటుందని, వారు తమకు తాముగా స్వీయ నిర్ణయాలు తీసుకోలేరని పేర్కొన్నారు. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వారికి విచక్షణాధికారాలు ఉంటాయని తెలిపారు. రాజ్యాంగ అధికరణం 200లో పేర్కొన్నట్లుగా తమ వద్దకు వచ్చిన బిల్లులను ఆమోదించడం, లేదా పునఃపరిశీలనకు పంపించడం, లేదా తిరస్కరించడమో చేయాలన్నారు. గవర్నర్లు అయితే తమ వద్దకు వచ్చిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం నిలిపి ఉంచవచ్చని, నిరవధికంగా మాత్రం ఆపివేయరాదని వాదించారు. బుధవారం కూడా ఈ కేసు విచారణ కొనసాగనుంది.


