చిట్వేల్, ఆగస్టు 28 ( పున్నమి ప్రతినిధి):శివ
అన్నమయ్య జిల్లా చిట్వేల్ టైగర్ ప్రాజెక్ట్ కారిడార్లో గత నాలుగు నెలలుగా పెద్దపులి సంచరిస్తోందని చిట్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధీరజ్ పెరుమాళ్ళ తెలిపారు. శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పగలు–రాత్రి పులి సంచారం దృశ్యాలు రికార్డైనట్టు ఆయన వెల్లడించారు. సోమశిల బ్యాక్ వాటర్, ఒంటిమిట్ట, రాజంపేట, చిట్వేల్, రాపూరు ప్రాంతాలు ఈ కేంద్ర పరిధిలో ఉన్నాయని చెప్పారు.
నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు నుండి ఈ పులి చిట్వేల్ కారిడార్లోకి ప్రవేశించిందని తెలిపారు. ప్రస్తుతం అది ఇక్కడే సంచరిస్తుండగా, ఇంకా శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోకి వెళ్లలేదని వివరించారు. నాగార్జునసాగర్–శ్రీశైలం రేంజ్లో పులుల సంఖ్య 86 దాటిందని, అందువల్ల కొత్త పులులు విస్తరించి కారిడార్ మార్గంలో సంచరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు రాత్రి ఒంటరిగా ప్రయాణాలు చేయకుండా, జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.


