9వ వార్డు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
– కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్
కడప, ఆగస్టు 23: పున్నమి ప్రతినిధి
కడప నగరపాలక సంస్థ పరిధిలోని 9వ వార్డును అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసి నగరంలోనే నంబర్ వన్ వార్డుగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యమని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తల పవన్ కుమార్ స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం 9వ వార్డు పరిధిలోని పలు కాలనీలు, వీధుల్లో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
ప్రచార పర్యటన సందర్భంగా స్థానికులు వార్డులో నెలకొన్న పలు సమస్యలను బత్తల పవన్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, అంతర్గత మురుగు కాలువల నిర్వహణ లోపం, చెత్త తొలగింపు, వీధి దీపాల సమస్యలతో పాటు పలు కాలనీల్లో సీసీ రోడ్ల మరమ్మతుల ఆవశ్యకతను వివరించారు.
ఈ సందర్భంగా బత్తల పవన్ కుమార్ మాట్లాడుతూ.. గత పాలకులు 9వ వార్డు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. కనీస మౌలిక వసతులు సైతం సరిగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించి కార్పొరేటర్‌గా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు రాబట్టి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, నాణ్యమైన రోడ్లు, మెరుగైన పారిశుధ్య నిర్వహణ, నిరంతర తాగునీటి సౌకర్యం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. 9వ వార్డును కడప నగరంలోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానని బత్తల పవన్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ వార్డు ప్రముఖ నాయకులు గౌరీ శంకర్, గంగాధర్, కృష్ణారెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు, యువజన విభాగం ప్రతినిధులు, వార్డు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



