16 నెలలు గడుస్తున్నా అందని ఉపాధి హామీ డబ్బులు
0 40 మంది కూలీల రూ.2.16 లక్షలు ఏమైనట్లు…
పట్టించుకోని ఉపాధి హామీ అధికారులు
ఆందోళన వ్యక్తం చేస్తున్న కోనాపురం గ్రామ ఉపాధి కూలీలు
హామీ పథకంలో పనిచేస్తే 16 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఉపాధి కూలీ డబ్బులు రాకపోవడంతో ఉపాధి హామీ కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…. చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 2025వ సంవత్సరం మే నెలలో మండల కుమారస్వామి చెలుక నుండి పసునూటి ఆనందం చెలుక వరకు ఉన్న ఎస్సారెస్పీ కాలువలో పేరుకపోయిన చెత్తాచెదారం, పూడిక మట్టిని 40 మంది కూలీలు మూడు వారాలపాటు తొలగించారు. అంతేకాక ఎస్సారెస్పీ కాలువను మొత్తం శుభ్రం చేశారు. అనంతరం అదే నెలలో పని పూర్తికాగానే టెక్నికల్ అసిస్టెంట్ సురేందర్, ఈసీ
కిషోర్ కుమార్ లు చేసిన పని ప్రదేశానికి వచ్చి కొలతలను, హాజరు మస్టర్లను తీసుకొని వెళ్లారని తెలిపారు. కానీ ఉపాధి హామీ పథకంలో కూలీ పనులు చేపట్టి ఇప్పటి వరకు 16 నెలలు గడుస్తున్నా మూడు వారాలకు సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు అందలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికి రోజుకు రూ.300 చొప్పున వారానికి రూ.1800 మూడు వారాలపాటు రూ. 5 వేల 200 చొప్పున మొత్తం 40 మంది కూలీలకు రూ. 2.16 లక్షల రూపాయలు రావాల్సి ఉందని కూలీలు ఈసంపల్లి మహేందర్, రవళిక, పసునూటి రవి, కవిత, తాండ్ర చిన్న స్వామి, ఎలీషా, రామ్ చంద్రు, సాంబ, కుమారస్వామి, రవి, స్వామి, కౌసల్య, యాకలక్ష్మి తదితరులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నిమార్లు మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయానికి వెళ్లి అధికారులను అడిగినా రేపు మాపు కూలీ డబ్బులు వస్తాయని అంటూ తిప్పించుకుంటున్నారని డబ్బులు మాత్రం రావడం లేదని ఏపీఓ అరుణను అడిగినా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఉన్నతాధికారులు గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన కూలీ డబ్బులను వెంటనే చెల్లించి తమ నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే కూలీలమంతా కలిసి ఉపాధి హామీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.


