పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)
ఎలమంచిలి: వినాయక ఉత్సవాలను చూసేందుకు ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి మరుసటి రోజు డ్రైనేజీ కాలువలో మృతిచెందిన ఘటన ఎలమంచిలిలో చోటుచేసుకుంది. ఎలమంచిలి ఉలకపేటకు చెందిన మల్ల నూకరాజు (51) ఈ ఘటనలో మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 24న రాత్రి సుమారు 7 గంటలకు తులసినగర్ భూలోకమాంబ వినాయక ఉత్సవాలను చూసేందుకు నూకరాజు వెళ్లారు. కుటుంబ సభ్యులు నిమజ్జనం కార్యక్రమం ముగించుకుని రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరుకున్నప్పటికీ ఆయన తిరిగి రాలేదు. నరాల బలహీనత కారణంగా నెమ్మదిగా నడిచే నూకరాజు ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు.
ఈ క్రమంలో 25న ఉదయం సుమారు 7 గంటలకు కర్రి ఆదిలక్ష్మి ద్వారా కరణం అప్పారావు అపార్ట్మెంట్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద డ్రైనేజీ కాలువలో నూకరాజు పడి ఉన్నట్లు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని చూడగా ఎడమ నుదుటి భాగంలో, కుడివైపు దవడపై గాయాలు కనిపించాయి. ఎలమంచిలి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇన్క్వెస్ట్ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోవడం లేదా విద్యుత్ షాక్ కారణంగా మృతి చెంది ఉండవచ్చన్న కుటుంబ సభ్యుల అనుమానాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


