హైదరాబాద్ / ఖమ్మం
తెలంగాణలో ప్రజాస్వామ్య నిరసనలను హౌస్ అరెస్టులు, ముందస్తు నిర్బంధాలతో అణచివేయడం సరికాదని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను సోమవారం ఉదయం వారి ఇళ్ల వద్దే పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రవ్యాప్తంగా ముందస్తుగా అదుపులోకి తీసుకున్న బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలందరినీ ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు, 22A సహా ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్ష హక్కు మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య బాధ్యత కూడా అని పేర్కొన్నారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాయరాదన్నారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకత్వం, తెలంగాణలో జరుగుతున్న ముందస్తు నిర్బంధాలపై కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజల గొంతును అరెస్టులతో అణచలేరని, ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం గౌరవించాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.


