జయశంకర్ భూపాలపల్లి జిల్లా | 16-08-2026(పున్నమి ప్రతినిధి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఐ ఆర్గన్ బాడీ డొనేషన్ అవేర్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నేత్రదానం, అవయవదానం మరియు శరీరదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న రెంటాల చంద్రశేఖర్ రెడ్డి గారు, తన తండ్రి లింగారెడ్డి గారి ఆదర్శాన్ని స్ఫూర్తిగా తీసుకొని, తన మరణానంతరం నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చారు. నేత్రదానంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, తన కళ్ల ద్వారా మరొకరి జీవితంలో వెలుగు నింపాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు.
నేత్రదానానికి ముందుకు వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి గారిని అసోసియేషన్ సభ్యులు అభినందించి, అభినందన పత్రాన్ని అందజేశారు. ఆయన తీసుకున్న నిర్ణయం సమాజానికి ఆదర్శప్రాయమని సభ్యులు కొనియాడుతూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ దేవునూరి చంద్రమౌళి గారు మాట్లాడుతూ:
«“సమాజంలో ఒకవైపు కళ్లను కోల్పోయి వెలుగు కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారు. మరోవైపు కళ్లను కలిగి ఉన్న మనం ఉన్నాం. మన మరణానంతరం మన కళ్లను దానం చేయడం ద్వారా ఒకరి చీకటి జీవితాన్ని వెలుగుతో నింపవచ్చు. కళ్లులేని వారిని కనులున్న సమాజంలోకి తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలి.”»
చంద్రశేఖర్ రెడ్డి గారు ఆదర్శంగా నిలిచి నేత్రదానానికి ముందుకు రావడం అభినందనీయమని, ఆయన స్ఫూర్తితో మరింత మంది నేత్రదానం, అవయవదానం మరియు శరీరదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ దేవునూరి చంద్రమౌళి గారు, అధ్యక్షులు బందెల భూమయ్య గారు, జనరల్ సెక్రటరీ డాక్టర్ జె.సి. రాజు ఆరుముల్లా గారు, ట్రెజరర్ గరిగ రమేష్ గారు, జాయింట్ సెక్రటరీ చెర్ల రమేష్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు సోమనవేణి తిరుపతి గారు, వంగ మోహనాచారి గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


