ఎల్బీనగర్: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని కమ్యూనిటీ హాల్‌లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుభం జువెలర్స్, సురేష్ జువెలర్స్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో 3,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణనాథుని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆడాళ్ల రమేష్ మాట్లాడుతూ.. గత 58 సంవత్సరాలుగా మంగీలాల్, వెన్నారామ్ చౌదరీ కుటుంబం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగడం అభినందనీయమన్నారు. అన్నదానం ఎంతో పవిత్రమైన సేవా కార్యక్రమమని, ఈ సంప్రదాయం భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. వినాయక ఉత్సవాలను ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా సమాజంలో సేవా స్ఫూర్తి పెంపొందుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



