గాజువాక, (పున్నమి ప్రతినిధి): రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారిన శక్తులను ప్రజలు గుర్తించి దూరం పెట్టాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా, పరిపాలనా పరంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిందని విమర్శించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీ నాయకత్వం ఇప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాయకులు, ప్రస్తుతం కార్మికుల పట్ల ప్రేమ చూపుతున్నట్లు నటించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని పల్లా పేర్కొన్నారు. పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. కార్మికుల సంక్షేమం, పరిశ్రమ భవిష్యత్తు దృష్ట్యా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇటీవల ప్లాంట్‌లో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై స్పందించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి వెంటనే సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. మృతుల కుటుంబాలకు పరిహారంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించే దిశగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు కార్మిక కుటుంబాలకు ఊరటనిచ్చాయని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపుదలే ప్రస్తుతం ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలందరూ ఆ దిశగా సహకరించాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.





