* నీరు లేక కన్నీరు అవుతున్న పల్నాడు రైతులు.
* పున్నమి న్యూస్ మాచర్ల ఆగస్టు 17 :*
పల్నాడు జిల్లా దిగువ ప్రాంత రైతుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు వేసిన *వరి, పత్తి ,మిర పంటలు* నీరు లేక ఎండిపోయే దుస్థితికి చేరుకుంది. వేలాది ఎకరాల్లో వేసిన వరి చేలు పగుళ్లు బారి రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఫోటోలో కనిపిస్తున్నట్లుగా పచ్చగా కళకళలాడాల్సిన వరి మొక్కలు నేలలోని తేమ లేక వాడిపోతున్నాయి. పొలాలన్నీ పెద్ద పెద్ద పగుళ్లు వచ్చి ఎడారిని తలపిస్తున్నాయి. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి, విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.*”వాన దేవుడా కరుణించు”*
“బ్యాంకు రుణం, విత్తనాలు, ఎరువుల కోసం లక్షలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు నీరు లేక పంట చేతికి రాకపోతే మా పరిస్థితి ఏంటి? అప్పులు ఎలా తీర్చాలి?” అని ఒక రైతు కన్నీరు పెట్టుకున్నాడు. మరికొందరు రైతులు చేతులు జోడించి “వాన దేవుడా మమ్మల్ని కరుణించు” అంటూ ఆకాశం వైపు చూస్తూ ప్రార్థనలు చేస్తున్నారు.జిల్లాలోని చాలా గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లు ఎండిపోయాయి. కాలువలకు కూడా నీరు రాకపోవడంతో రైతులకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ప్రతి రోజు ఆకాశం వైపు చూస్తూ మేఘాల కోసం ఎదురుచూస్తున్నారు. *నాగార్జునసాగర్ నీటి కోసం ఎదురుచూపులు*
పల్నాడు రైతులకు ఆశ అల్లా *నాగార్జునసాగర్ ప్రాజెక్ట్* నుంచి వచ్చే నీరే. కానీ సాగర్ లో నీటి మట్టం తగ్గడంతో ఇప్పటివరకు కాలువలకు నీటి విడుదల చేయలేదు.
“సాగర్ గేట్లు ఎత్తి నీరిస్తేనే మా పంటలు బతుకుతాయి. లేదంటే ఈ ఏడాది మొత్తం చేతులు కాల్చుకున్నట్టే” అని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.*దిగుబడిపై తీవ్ర ప్రభావం*
వాతావరణ శాఖ మరో వారం రోజులు వర్షాలు ఉండవని చెప్పడంతో రైతుల ఆందోళన మరింత పెరిగింది. ఇప్పటికే 50% కంటే ఎక్కువ వరి మొక్కలు వాడిపోయాయి. వర్షం రాకపోతే ఈ ఏడాది పల్నాడులో వరి దిగుబడి 70% వరకు తగ్గిపోయే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.


