తేదీ: 12-08-2026
పున్నమి పత్రిక | ప్రత్యేక కథనం
కేరమెరి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరి మండలంలోని దేవపూర్ గ్రామానికి రహదారి, వంతెన సౌకర్యం లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా PVTG కోలాం గిరిజన కుటుంబాలు అత్యవసర వైద్య సేవలు పొందడంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని గ్రామానికి చెందిన కొడప రమేశ్వరి వాపోయారు.
దేవపూర్ గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు ఉండటంతో వర్షాకాలంలో రాకపోకలు మరింత కష్టతరంగా మారుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేని పరిస్థితి నెలకొనడంతో గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వాగు ఉధృతంగా ప్రవహించే సమయంలో గ్రామం బయటకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అత్యవసర వైద్యం అవసరమైన సమయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోందని గ్రామస్తులు పేర్కొన్నారు.
“మా గ్రామానికి రోడ్డు, వాగుపై వంతెన నిర్మిస్తే మా కష్టాలు తీరుతాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి” అని దేవపూర్ గ్రామ ప్రజలు కోరుతున్నారు.
PVTG కోలాం గిరిజనుల జీవన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు గ్రామాన్ని పరిశీలించి, రోడ్డు నిర్మాణంతో పాటు వాగుపై వెంటనే వంతెన మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.



