శృంగవరపు కోట నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా ఎల్ కోట క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆమె వారి సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు. ఈ దర్బార్‌లో ప్రజల నుంచి మొత్తంగా 24 వినతులు అందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రజా దర్బార్‌లో స్వీకరించిన 24 వినతులలో అత్యధికంగా పెన్షన్ల సమస్యలపైనే ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. వీటిలో పెన్షన్లకు సంబంధించి 12 వినతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి 5, రెవెన్యూ శాఖకు సంబంధించి 3 రాగా.. విద్యుత్ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి రెండేసి చొప్పున వినతులు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన ఈ వినతులపై ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తక్షణమే స్పందించారు. ఆయా సమస్యలను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆమె కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులను తీర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


