ములుగు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారిణి (DMO) శ్రీమతి K. సురేఖ గారు దుర్మరణం చెందారు. తాడ్వాయి-పస్రా మధ్యలో ఆమె ప్రయాణిస్తున్న కారును లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న సురేఖ గారితో పాటు మరొకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది.
ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలోనే ఆమె కుమారుడు మృతి చెందాడు.
ఆరు నెలల క్రితం భర్త కూడా కన్నుమూశారు.
ఆ విషాదాల నుంచి కోలుకోకముందే నేడు జరిగిన ప్రమాదంలో సురేఖ గారు కూడా మరణించడంతో బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సురేఖ గారు గతంలో మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ అధికారిణిగా కూడా సమర్థవంతంగా సేవలందించారు. ఆమె ఆకస్మిక మృతి పట్ల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.



