అనంతగిరి మండలం ములియగూడ గ్రామ జంక్షన్ వద్ద రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కేటాయించిన ఎఫ్‌పీఓ స్థలంపై కబ్జా యత్నం జరుగుతోందని ఎఫ్‌పీఓ ప్రతినిధులు ఆరోపించారు. రైతుల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు రాటలు వేసుకోవడం వివాదానికి దారితీసింది.
వెలుగు సంస్థ పరిధిలోని ఫార్మర్ ప్రొడ్యూస్ సంఘాల రైతుల కోసం ఈ స్థలాన్ని ఎఫ్‌పీఓ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించినట్లు ప్రతినిధులు తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, ఇతర సేవలను అందించడంతో పాటు రైతుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ కల్పించేందుకు ఎఫ్‌పీఓ పనిచేస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అక్రమంగా రాటలు వేస్తున్న విషయాన్ని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీంతో స్థలాన్ని పరిశీలించేందుకు పంచాయతీ నుంచి వీఆర్వోతో పాటు వీఆర్ఏను పంపించినట్లు పేర్కొన్నారు.
“రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఎఫ్‌పీఓ భవనం నిర్మాణానికి స్థలం కేటాయిస్తే, ఇతరులు వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమించడం సరికాదు. ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలి. ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతూ ఎఫ్‌పీఓ భవన నిర్మాణానికి అధికారులు సహకరించాలి” అని ఎఫ్‌పీఓ సీసీ సూరిబాబు, ఎఫ్‌పీఓ అకౌంటెంట్ కుమారి కోరారు.
ప్రభుత్వం రైతుల కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జాకు గురికాకుండా రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. స్థలాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి హద్దులను నిర్ధారించి, అక్రమ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు.



