రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
————————————————————————–
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి
*ఆహారం, పారిశుద్ధ్యం, హాజరు, మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ*
*విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత.. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు*
*చలికాలంలో వెచ్చని నీరు, దుప్పట్లు అందుబాటులో ఉంచాలి*
*దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన ఏకరూప దుస్తులు అందేలా చర్యలు*
*ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలి*
*రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు*
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ, విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని *రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు* జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సోమవారం, హైదరాబాదు నుంచి *ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు* రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఈ వీడియో సమావేశానికి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో *రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి* మాట్లాడుతూ.. రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యతో పాటు వారికి అందుతున్న మౌలిక వసతులపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కలెక్టర్లు క్రమం తప్పకుండా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసి, క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ, కొన్ని చోట్ల ఆహార విషబాధ, ఎలుకలు, పాము కాటు వంటి ఘటనలు చోటు చేసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని సీఎస్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఆహారం తయారీ, ఆహార పదార్థాల నిల్వ, వినియోగంలో నిర్దేశిత ప్రామాణిక నిర్వహణ విధానాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల లోపాలు, తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వంటశాలలను ఆధునికీకరించే అవకాశం ఉన్న చోట్ల పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను ఉన్నతస్థాయిలో పర్యవేక్షించేందుకు రూపొందించిన డ్యాష్‌బోర్డ్‌ను కలెక్టర్లు క్రమం తప్పకుండా పరిశీలించాలని తెలిపారు. విద్యాసంస్థల్లోని సౌకర్యాలు, లోపాలు, చేపట్టిన పరిష్కార చర్యల వివరాలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో చేపట్టిన మార్పులను ఉన్నతస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుంటుందని తెలిపారు.
జిల్లాలో రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు సంబంధించి ప్రతికూల నివేదికలు వచ్చినప్పుడు అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని సూచించారు. ఏదైనా సమాచారం తప్పుడు ప్రచారంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, వాస్తవంగా సమస్య ఉన్నట్లు తేలితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి, అమలు చేస్తోందని, కాస్మెటిక్ ఛార్జీలను డీబీటీ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.
రానున్న శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు స్నానానికి వెచ్చని నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన దుప్పట్లను ముందుగానే సమకూర్చాలని ఆదేశించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రెసిడెన్షియల్ విద్యాసంస్థల భవన యజమానులతో కలెక్టర్లు సమావేశమై, అవసరమైన మార్పులు, మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమైన శిక్షణ అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇకపై ప్రతిరోజూ ఒక లక్ష ఏకరూప దుస్తులు కుట్టేలా చర్యలు తీసుకోవాలని, దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన ఏకరూప దుస్తులు అందేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. యూనిఫాం క్లాత్ ఇప్పటికే జిల్లాలకు చేరినందున కుట్టు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలు, సమస్యల పరిష్కార వివరాలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో క్రమం తప్పకుండా నవీకరించాలని ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పోషకాహారం, మానసిక శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అన్ని విద్యాసంస్థల్లో ఎఫ్ఆర్ఎస్ (FRS) హాజరు తప్పనిసరిగా అమలు చేయాలని, సిబ్బంది సమయపాలన, విధుల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
విద్యార్థులకు అందించే భోజనం నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండేలా వంటశాల పారిశుద్ధ్యాన్ని ప్రతిరోజూ తనిఖీ చేయాలని ఆదేశించారు. వంటగది, పాత్రలు, ఆహార నిల్వ గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రతి విద్యాసంస్థకు ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించి, విద్యార్థుల సంక్షేమం, హాజరు, పారిశుద్ధ్యం, ఆహార నాణ్యత, తాగునీటి సౌకర్యాలు, భద్రత, తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నోడల్ అధికారులు క్రమం తప్పకుండా సంస్థలను సందర్శించి, నివేదికలు సమర్పించాలని చెప్పారు.
బాలికల విద్యాసంస్థల్లో మహిళా అధికారిని తప్పనిసరిగా నియమించాలని ఆదేశించారు. బాలికల భద్రత, ఆరోగ్యం, వ్యక్తిగత సమస్యలు, పరిశుభ్రత, కౌన్సెలింగ్ వంటి అంశాలపై మహిళా అధికారి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలన్నారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, భావోద్వేగ ఇబ్బందులను గుర్తించి, అవసరమైన కౌన్సెలింగ్ అందించాలని, ప్రతి విద్యాసంస్థలో విద్యార్థులతో తరచూ మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని సంక్షేమ, గురుకుల, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎఫ్ఆర్ఎస్ (FRS) హాజరు తప్పనిసరిగా నమోదు కావాలని, ప్రతి విద్యాసంస్థలో నిత్య పర్యవేక్షణతో పాటు పరిశుభ్రత, ఆహార నాణ్యత, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రతి రోజు తనిఖీ చేసే విధంగా నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. తనిఖీల సమయంలో వంటగది పరిశుభ్రత, తాగునీటి స్వచ్ఛత, మరుగుదొడ్ల నిర్వహణ, తరగతి గదులు, హాస్టల్ గదుల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు.
విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. వంటకు ఉపయోగించే ముడి సరుకుల నాణ్యత, ఆహార తయారీ విధానం, భోజనం వడ్డించే పరిశుభ్రతను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా బాలికల విద్యాసంస్థల్లో మహిళా అధికారులను ప్రత్యేక నోడల్ అధికారులుగా నియమించి, విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
విద్యాసంస్థల్లో పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియా బేగం, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ రావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి హసీనా బేగం, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి మురళీధర్ రావు, ఆహార భద్రత అధికారి వినీల్, డీసీఓ మాన్వీ చంద్, డీఎంహెచ్ఓ వాణిశ్రీ, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





