27 నక్షత్రాల పవిత్రతను ప్రతిబింబించే “నక్షత్రవనం” ప్రత్యేక ఆకర్షణ – టిడ్కో కాలనీల్లో ఆధ్యాత్మిక వాతావరణమే లక్ష్యం
ఆత్మకూరు, మే 22 (హరికిరణ్ , పున్నమి ప్రతినిధి):
రాష్ట్రంలోని టిడ్కో కాలనీలకు ఆదర్శంగా ఆత్మకూరు టిడ్కో కాలనీలో నిర్మాణంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం నిలుస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.శుక్రవారం ఉదయం ఆత్మకూరు పట్టణంలోని టిడ్కో కాలనీలో నిర్మిస్తున్న ఆలయాన్ని అధికారులు, స్థానిక నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శ్రీవాణి భజన మందిరాల పథకం కింద రాష్ట్రంలో నిర్మాణం పూర్తి దశకు చేరుకున్న తొలి ఆలయం ఇదేనని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐదువేలకుపైగా శ్రీవాణి భజన మందిరాలు ప్రతిపాదించగా, వెయ్యికిపైగా ఆలయాలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం కింద రూ.10 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మకూరులో రూ.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రామాలయం పనులు ప్రస్తుతం 80 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు.ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సంబంధించిన పవిత్ర మొక్కలతో ప్రత్యేక “నక్షత్రవనం” ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పురాణాల గొప్పతనాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక శోభతో, ప్రశాంత వాతావరణంతో తీర్చిదిద్దుతూ భక్తులకు ఆహ్లాదకర అనుభూతి కలిగేలా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.ఆత్మకూరు నమూనాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో కాలనీల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రామాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి ఆనం తెలిపారు. పేదలు నివసించే కాలనీల్లో ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.హిందూ ధర్మ వైభవం, సనాతన ధర్మ ఆచారాలను పరిరక్షిస్తూ ప్రజల్లో భక్తి భావం, ధార్మిక చింతన పెంపొందించేందుకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి రూ.73 లక్షల ఆర్థిక భరోసా
విధి నిర్వహణలో మృతి చెందిన శానిటరీ వర్కర్ కుటుంబానికి ఎన్డీఏ ప్రభుత్వం అండ – భార్య కామేశ్వరికి చెక్కు అందజేసిన మంత్రి ఆనం
ఆత్మకూరు, మే 22 (హరికిరణ్ ,పున్నమి ప్రతినిధి): విధి నిర్వహణలో మృతి చెందిన ఆత్మకూరు మున్సిపాలిటీ శానిటరీ వర్కర్ చిచ్చు మల్లికార్జునరావు కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
శుక్రవారం ఆత్మకూరులో జరిగిన కార్యక్రమంలో మృతుని భార్య కామేశ్వరికి ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విధి నిర్వహణలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి దాదాపు రూ.73 లక్షల మేర ఆర్థిక భరోసా కల్పించడం జరిగిందన్నారు.ఆత్మకూరు మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ నుంచి రూ.5 లక్షలు మృతుని భార్య కామేశ్వరికి అందిస్తున్నట్లు తెలిపారు. యాక్సిస్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ద్వారా పిల్లల చదువుల కోసం రూ.8 లక్షలు, మరో రూ.20 లక్షల ఇన్సూరెన్స్ నగదు అందనున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌కు ఇన్సూరెన్స్ ఉండటంతో మరో రూ.35 లక్షలు బీమా రూపంలో లభించనున్నాయని చెప్పారు.అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండటంతో పార్టీ తరఫున మరో రూ.5 లక్షల సహాయం అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయానికి ఈ సంఘటన నిదర్శనమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పిల్లల చదువులకు పూర్తి భరోసా కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ గంగాప్రసాద్ , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి గిరి నాయుడు ,ఆనం లీలా కైవల్య రెడ్డి, పట్టనాధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


