రాజీవ్ సాగర్ కెనాల్ సబ్ బ్రాంచ్ కాలువల నిర్మాణం చేపట్టాలి:
ఏన్కూరు మండల రైతుల విజ్ఞప్తి
జులై 24 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
ఏన్కూరు మండల రైతాంగానికి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రాజీవ్ సాగర్ కెనాల్‌కు సంబంధించిన సబ్ బ్రాంచ్ (పిల్ల కాలువలు) నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనా అనుమతులు (సాంక్షన్) మంజూరు చేసినప్పటికీ, ఇప్పటి వరకు వాటి నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడం పట్ల మండల రైతులు తీవ్ర అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సబ్ బ్రాంచ్ కాలువల నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క పిల్ల కాలువ కూడా నిర్మించకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని వారు వాపోతున్నారు.
ఈ కాలువలు నిర్మితమైతే ఏన్కూరు మండలంలోని అనేక గ్రామాల వ్యవసాయ భూములకు సాగునీరు అందే అవకాశం ఉందని, రైతులు పంటలను సకాలంలో సాగు చేసి ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. కాలువల నిర్మాణం ఆలస్యం కావడంతో రైతులు వర్షాధార సాగుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాబట్టి ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రాజీవ్ సాగర్ కెనాల్‌కు సంబంధించిన సబ్ బ్రాంచ్ (పిల్ల కాలువల) నిర్మాణ పనులను ప్రారంభించి, ఏన్కూరు మండల రైతాంగానికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుకుంటున్నారు

