ఆత్మకూరు, జూన్ 17 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న గడ్డం వారి కుటుంబం మరోసారి తమ సేవా కార్యక్రమాన్ని కొనసాగించింది.నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలోని అశ్వినీపురం గ్రామానికి చెందిన సైదుల్లా అనే యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు.ఈ సందర్భంగా బుధవారం పాత జంగాలపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ గడ్డం విజయ భాస్కర్ రెడ్డి గత నాలుగేళ్లుగా నువ్వూరుపాడు పంచాయతీ పరిధిలో ఎవరైనా మృతి చెందినప్పుడు వారి అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా రూ.5 వేల తక్షణ ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నారు.అయితే గడ్డం విజయ భాస్కర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందడంతో, ఆయన సేవా స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన సోదరుడు గడ్డం శ్రీనివాసులు రెడ్డి ముందుకు వచ్చారు.విజయ భాస్కర్ రెడ్డి జ్ఞాపకార్థంగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ అశ్వినీపురం గ్రామానికి చెందిన సైదుల్లా కుటుంబ సభ్యులకు అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గడ్డం శ్రీనివాసులు రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో పేద కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మోరంరెడ్డి షేక్ హుస్సేన్, షేక్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.


