ఆగస్టు 12(పున్నమి ప్రతినిధి)నిర్మల్ జిల్లా భైన్సా మండలంలోని పలు పలు గ్రామల్లో భక్తితో భజనలు చేస్తూ.. పోలీసులకు అండగా గ్రామస్థులు
“మేము ఉన్నాం.. మీకు అండగా ఉంటాం” అంటూ పోలీసులకు సహకారం
ఇటీవలి కాలంలో దొంగలు గ్రామాల్లోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పోలీసులు రాత్రి వేళల్లో నైట్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు అండగా తాము కూడా ఉంటామని మీర్జాపూర్, వానల్‌పహాడ్, తిమ్మాపూర్ తదితర గ్రామాల ప్రజలు ముందుకు వచ్చి పోలీసులకు సహకరిస్తూ తమ సామాజిక, నైతిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.
రాత్రి వేళల్లో పోలీసులు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గ్రామస్థులు భక్తితో భజనలు చేస్తూ వారికి సహకరిస్తున్నారు. “మేము ఉన్నాం.. మీకు అండగా ఉంటాం” అంటూ పోలీసులకు భరోసా కల్పిస్తూ గ్రామాల భద్రతలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
పోలీసుల పట్ల ప్రజలకు ఉన్న గౌరవం, విశ్వాసానికి గ్రామస్థుల సహకారం నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజలు–పోలీసుల మధ్య ఇలాంటి సత్సంబంధాలు కొనసాగితే నేరాల నియంత్రణతో పాటు గ్రామాల భద్రతను మరింత పటిష్టంగా కాపాడుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
రాత్రి వేళల్లో ప్రజలు స్వచ్ఛందంగా అప్రమత్తంగా ఉంటూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించడం అభినందనీయమని అధికారులు తెలిపారు.
ప్రజలు–పోలీసుల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందిస్తూ, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఈ నూతన విధానాన్ని చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులైన గౌరవ ఎస్పీ మేడమ్ మరియు ఏఎస్పీ సార్‌లను భైంసా రూరల్ పరిధిలోని ప్రజలు అభినందిస్తున్నారు.
అదేవిధంగా పోలీసులకు అండగా నిలుస్తూ, రాత్రి వేళల్లో సహకరిస్తున్న గ్రామస్థుల సేవాభావాన్ని అధికారులు ప్రశంసించారు. ప్రజల సహకారంతోనే గ్రామాల్లో శాంతిభద్రతలను మరింత సమర్థవంతంగా పరిరక్షించవచ్చని వారు పేర్కొన్నారు.



