మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి – గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు
ఆత్మకూరు, జూన్ 8 (హరికిరణ్ పున్నమి ప్రతినిధి):
బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా యాత్రికులు ముగ్గురు మృతి చెందడం పట్ల రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.సంగం మండలానికి చెందిన ఇద్దరు భక్తులు, నెల్లూరు నగరానికి చెందిన ఒకరు మొత్తం ముగ్గురు యాత్రికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని మంత్రి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని సంగం, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన 43 మంది యాత్రికులతో గయా, వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరిన ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురికావడం బాధాకరమన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మంత్రి, ఈ దుర్ఘటన బాధిత కుటుంబాలకు తీరని లోటని అన్నారు. స్వస్థలాలకు దూరంగా జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర వేదనలో ఉన్నారని, వారి బాధను రాష్ట్ర ప్రభుత్వం పంచుకుంటుందని పేర్కొన్నారు.ప్రమాదంలో గాయపడిన యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మంత్రి, వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా అధికార యంత్రాంగం ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రమాదానికి గురైన యాత్రికుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బాధితులకు సహాయ సహకారాలు అందించడంలో ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించినట్లు పేర్కొన్నారు.మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించిన మంత్రి, వారి కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని పొందాలని భగవంతుడిని ప్రార్థించారు. గాయపడిన వారు త్వరగా కోలుకుని క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.యాత్రికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రమాద బాధితులకు అవసరమైన సహాయం అందేలా జిల్లా యంత్రాంగంతో పాటు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

