పున్నమి ప్రతినిధి వరికుంటపాడు
మండల కేంద్రమైన వరికుంటపాడులో మూడు రోజులుగా రాత్రి 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని వినియోగదారులు వాపోతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా మూడు గంటలపాటు విద్యుత్ కోత విధించడంతో రాత్రివేళ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.విద్యుత్ బిల్లు చెల్లింపులో జాప్యం జరిగితే చర్యలు తీసుకునే అధికారులు.. ముందస్తు సమాచారం లేకుండా రోజూ మూడు గంటలపాటు సరఫరా నిలిపివేయడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి గల కారణాలను అధికారులు వెల్లడించాలని కోరుతున్నారు. సమస్యను పరిశీలించి సరఫరా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.


