సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ వేద భారతి పీఠంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక వైదిక హోమాలు ఘనంగా నిర్వహించారు.
పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితులు స్వస్తి వాచనం, రాజ్యాధికార హోమం, ఆయుష్య హోమం, ధన్వంతరి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు చేకూరాలని, ఆయన నాయకత్వంలో దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని సంకల్పం చేశారు.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ… వేదమే భారతీయ సంస్కృతికి మూలమని, వేద ఘోషతోనే దేశానికి రక్షణ కలుగుతుందని అన్నారు. ప్రధాని మోదీ వేద సంస్కృతికి, సనాతన ధర్మ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. వేద మంత్రాలతో చేసే హోమాలు కేవలం వ్యక్తి శ్రేయస్సుకే కాకుండా, లోక కళ్యాణానికి, ప్రకృతి సమతుల్యతకు దోహదపడతాయని తెలిపారు.
వేదం నిత్యం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి లభిస్తుందని, యువత వేద విద్యను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రధానికి వేదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో వేద పాఠశాల విద్యార్థులు, వైదిక గురువులు పాల్గొన్నారు.
Uploaded Video:



