ఫార్మాసిటీ బాధితులకు శుభవార్త
387 మంది రైతులకు ప్లాట్ల పట్టా డాక్యుమెంట్ల పంపిణీ
రేపు ఇబ్రహీంపట్నం శాస్త గార్డెన్స్‌లో కార్యక్రమం
యాచారం, ఆగస్టు 10: ఫార్మాసిటీ కోసం భూములు కోల్పోయిన నాలుగు గ్రామాల రైతులకు ప్లాట్ల పట్టా డాక్యుమెంట్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతులకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా రేపు పట్టా డాక్యుమెంట్లు అందజేయనున్నట్లు యాచారం తహశీల్దార్ అయ్యప్ప తెలిపారు.
ఇబ్రహీంపట్నంలోని శాస్త గార్డెన్స్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా మొత్తం 387 మంది రైతులకు ప్లాట్ల పట్టా డాక్యుమెంట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఫార్మాసిటీ కోసం భూములు కోల్పోయిన రైతులకు పునరావాసం, ప్లాట్ల కేటాయింపులో భాగంగా ఈ డాక్యుమెంట్ల పంపిణీ చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సంబంధిత రైతులందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా డాక్యుమెంట్లు స్వీకరించేందుకు నిర్ణీత సమయానికి కార్యక్రమానికి హాజరు కావాలని తహశీల్దార్ అయ్యప్ప సూచించారు.
రైతులందరూ తప్పనిసరిగా సకాలంలో హాజరై పట్టా డాక్యుమెంట్లు స్వీకరించాలని అధికారులు కోరారు.



