ప్రజావాణిలో వినతికి తక్షణ స్పందన
రెండు కుంటల ప్రభుత్వ భూమి కేటాయింపుపై తహసీల్దార్‌కు ఆదేశం
ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు ప్రెస్ క్లబ్ కృతజ్ఞతలు
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
జర్నలిస్టుల సంక్షేమం, వారి వృత్తిపరమైన అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ఏన్కూరు ప్రెస్ క్లబ్‌కు సొంత భవనం నిర్మించుకునేందుకు ప్రభుత్వ భూమి కేటాయించే దిశగా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సానుకూలంగా స్పందించారు. సోమవారం మండల ప్రజావాణి కార్యక్రమంలో ఏన్కూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమిని కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల అవసరాన్ని గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం రెండు కుంటల ప్రభుత్వ భూమిని గుర్తించి కేటాయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానిక తహసీల్దార్‌కు సూచించారు. ప్రజావాణి వేదికగా వచ్చిన వినతిపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించడం పట్ల ప్రెస్ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్‌కు సొంత భవనం ఏర్పాటైతే మండలంలోని పాత్రికేయులకు సమావేశాలు, మీడియా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఏన్కూరు ప్రెస్ క్లబ్ చిరకాల ఆకాంక్ష అయిన సొంత భవన నిర్మాణానికి భూమి కేటాయింపు విషయంలో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ భూమి గుర్తింపు, కేటాయింపు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏన్కూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ధీరావత్ సందీప్ కుమార్ నాయక్, కార్యదర్శి బానోత్ గోపికృష్ణ, సభ్యులు ఎలగోటి అశోక్ రెడ్డి, ఇస్లావత్ నరసింహారావు, రమేష్, చంద్రశేఖర్, గోపాల్ రావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.


