అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ పరిధిలోని పెదకోట అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదకోట సెక్టార్ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సమతుల్య ఆహారం, పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రోజువారీ ఆహారంలో నూనె, చక్కెర, ఉప్పును పరిమితంగా, సరైన మోతాదులో వినియోగించాల్సిన అవసరం ఉందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పోషకాహారానికి సంబంధించిన అవగాహన సామగ్రిని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
పోషణ మాసంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో పోషణ్ మేళాలు, వంటకాల ప్రదర్శనలు నిర్వహించాలని తెలిపారు. ముఖ్యంగా స్థానికంగా లభించే ఆహార పదార్థాలతో పోషక విలువలు కలిగిన ప్రాంతీయ వంటకాలను తయారు చేసి ప్రదర్శించాలని సూచించారు.
THR వంటకాలు, HCM మెనూతో పాటు స్థానిక ఆహార పదార్థాలతో తయారు చేసే వంటకాలను ప్రదర్శించాలని, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అవసరమైన ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు.
అంగన్వాడీ కార్యకర్తలు “పోషణ ప్లేట్” ద్వారా సమతుల్య ఆహారంలోని వివిధ రకాల పోషక పదార్థాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని సూచించారు. స్థానికంగా లభించే చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు తదితర పోషక విలువలు కలిగిన ఆహారాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని అవగాహన కల్పించారు.
పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్న వయస్సు నుంచే పెంపొందించడమే పోషణ మాసం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సూపర్వైజర్ సునీత తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త, ఘర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.



