పుష్పాంజలితో గణనాథులకు వీడ్కోలు.. ఆత్మకూరు నిమజ్జనంలో మంత్రి ఆనం
ఆత్మకూరులో వినాయక నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి నిమజ్జనానికి తరలివెళ్లిన గణనాథుల విగ్రహాలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పుష్పాభిషేకం చేసి వీడ్కోలు పలికారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నుంచి భక్తులకు అభివాదం చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. పట్టణం నుంచి సుమారు 50 వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలివెళ్లాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై గణేశ్ నినాదాలతో సందడి చేశారు. మంత్రితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.


