స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛత అవగాహన కార్యక్రమాన్ని నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో శనివారం విస్తృతంగా చేపట్టారు.
అన్ని డివిజన్లలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లను శుభ్రం చేస్తూ ట్యాంక్ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో అధికారులు విజయవంతంగా నిర్వహించారు.
స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని వాటర్ ట్యాంక్, పరిసర ప్రాంతాలను కమిషనర్ వై.ఓ నందన్ ప్రత్యక్షంగా శుభ్రం చేసి సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టాలని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలని సూచించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని ప్రజలకు సూచించారు.
స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని , ఈ కార్యక్రమాల్లో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకపోవడం, మొక్కలు నాటడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించామని కమిషనర్ ప్రకటించారు.
వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు పెరిగే అవకాశం ఉందని నగరపాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దినేష్ తెలిపారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని, తడి మరియు పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా సహకరించాలని తెలిపారు.
అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పేపర్ బ్యాగులు, ఇతర పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు కోరారు.
“మన చెత్త – మన బాధ్యత” అనే భావనతో ప్రతి పౌరుడు పనిచేస్తే నెల్లూరును పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దవచ్చని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ ఈ.ఈ. చంద్రయ్య,శానిటేషన్ విభాగం సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.



