నెల్లూరు నగరంలో ఆహార భద్రతపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ అజితా వేజెండ్ల ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని రియాజ్ హోటల్, బసోటో హోటళ్లను సందర్శించి ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.
రియాజ్ హోటల్‌లో పరిసరాలు శుభ్రంగా లేకపోవడం గమనించిన అధికారులు, వెంటనే శుభ్రత మెరుగుపర్చాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే కిచెన్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బిర్యానీని స్వయంగా పరిశీలించిన కలెక్టర్, వంటశాలలో ఉన్న చికెన్‌ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేయరాదని స్పష్టం చేశారు.
ఇక బసోటో హోటల్‌లో తనిఖీల సందర్భంగా, ఎక్స్పైరీ డేట్ ముగియబోతున్న పెరుగు ప్యాకెట్లను ఎందుకు ఇంకా వాడకుండా ఉంచారంటూ నిర్వాహకులను ప్రశ్నించారు. ఆహార పదార్థాల నిల్వ విధానంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ, వినియోగదారుల ఆరోగ్యంతో రాజీ పడే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. హోటళ్లలో పరిశుభ్రత పాటించకపోతే, నాణ్యత లేని ఆహారం వడ్డిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందినట్లయితే సంబంధిత హోటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఆకస్మిక తనిఖీలతో హోటల్ నిర్వాహకుల్లో అప్రమత్తత పెరిగింది. జిల్లాలోని అన్ని హోటళ్లు నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.


