ప్రత్తిపాడు మండలంలో శనివారం వ్యవసాయ శాఖ అధికారులు ఎరువులు, విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు యన్. మోహన్ రావు, మండల వ్యవసాయాధికారిణి షేక్ సుగుణ బేగం పాల్గొన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల విక్రయంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు డీలర్లకు సూచించారు.
ప్రతి దుకాణం వద్ద అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలు, ధరల పట్టికలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రతి విక్రయం ఈ-పాస్ యంత్రం ద్వారా ఆధార్ ధృవీకరణతోనే జరగాలని, రైతులకు ఒరిజినల్ బిల్లు ఇవ్వాలని తెలిపారు. రైతుల పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ పరిశీలించిన తర్వాతే సాగు విస్తీర్ణం, పంటల వారీగా ఎరువులు అందించాలని సూచించారు.
ఖరీఫ్ సీజన్‌లో యూరియా, డీఏపీ ఎరువుల కొరత లేదని అధికారులు తెలిపారు. లైసెన్స్‌లో పేర్కొన్న అధికారిక గోదాముల్లోనే స్టాక్ నిల్వ చేయాలని, భౌతిక నిల్వలు, ఈ-పాస్ స్టాక్, రిజిస్టర్ వివరాలు సరిపోలాలని హెచ్చరించారు.
నిబంధనలు అతిక్రమించే డీలర్లపై ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్-1955, ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్-1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు సస్పెండ్ లేదా రద్దు చేసి స్టాక్ స్వాధీనం చేసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.


